Wednesday, March 30, 2011

గెలిచాం...


ఉత్కంఠభరితమైన దాయాదుల పోరులో భారత్ విజయం సాధించింది. టీం ఇండియా మొత్తం ఒక జట్టుగా ఆడి విజయం సాధించింది. బ్యాటింగ్ లో మాస్టర్ మరోసారి వెన్నెముకలా నిలవగా, చివర్లో రైనా సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీంలోని ఐదుగురు బౌలర్లకు ఒక్కొక్కరికి రెండేసి వికెట్లు దక్కడం టీం స్పిరిట్ కు అద్దం పట్టింది. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తం మీద మనవాళ్ళు జట్టుగా ఆకట్టుకున్నారు. పాక్ టీంలో వాహబ్ రియాజ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొత్తం మీద సెమీస్ గండం గట్టెక్కడంతో  కప్పు మనదేనన్న నమ్మకం ప్రతి భారతీయుడి కళ్ళలో కనిపిస్తోంది... మాటల్లో వినిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ ఇండియా!

Tuesday, March 29, 2011

పనికిమాలిన ఫీవర్


దేశంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే ఆఫీసులన్నీ బోసిపోతాయి. ఆ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్యనైతే దేశమంతటా కర్ఫ్యూ వాతావరణమే. ఇంట్లో పనులు మానేసి, ఆఫీస్ లకు సెలవు పెట్టి మ్యాచ్ చూసేవారెందరో... నాతోసహా. కోట్లమంది పనులు మానుకుని చూసే ఈ ఆట ఆ 11మంది చేతుల్లోనే ఉంది. వారు బాగా అడితే గెలుపు, లెదంటే ఓటమి. ఈ విషయం తెలిసిన మనం చూడటం మాత్రం మానం. దీన్నే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటారు. అంటె మనం ఏమీ చేయలేకపొయినా దాని గురించి అలోచించకుండా, మాట్లాడకుండా ఉండలేకపొవడం. క్రికెట్, పోలిటిక్స్, సినిమాలు... ఇలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి.
మరోటి సర్కిల్ ఆఫ్ ఇంఫ్లూయెన్స్... అంటే మనం ప్రభావితం చేయగల అంశాలు. మన చదువు, సంస్కారం, పనితీరు, ప్రవర్తన... ఇలాంటివాటిని మనం కంట్రోల్ చేయగలం.
జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకున్నవాళ్ళు, అందుకోవాలనుకునేవాళ్ళు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ కన్నా సర్కిల్ ఆఫ్ ఇంఫ్లూయెన్స్ కు ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తారు.. తమ పరిధిలోని అంశాలను ప్రభావితం చేస్తారు... విజయాలు చేజిక్కించుకుంటారు. మనం మాత్రం మనం ఏ మాత్రం ప్రభావం చూపలేని క్రికెట్, పాలిటిక్స్, సినిమాల గురించి గంటలు, గంటలు మాట్లాడుకుంటూ... మనకు తోచిన విస్లేషణలతొ తుత్తి పొందుతూ... కాలాన్ని వృధా చేసుకుంటూ ఇలా మిగిలిపోతాం. యామై రైట్?

Monday, March 28, 2011

ఎవరి గోల వారిదే!



రాష్ట్రాన్ని కదిపి కుదిపేస్తున్న సమస్యేమిటో అందరికీ తెలుసు. దీని వెనకున్న రాజకీయాలు, భావోద్వేగాలు, సామాజికాంశాల గురించి ఇప్పటికే పత్రికల నిండా పేజీలకు పేజీలు రాసేశారు.. టీవీల్లో గంటల కొద్దీ మాట్లాడేశారు. వాటిలోనూ ఎవరి వాదన వారిదే. ఎందుకలా జరుగుతుందంటే ఎవరి దృష్టి వారిదే కనుక... అదేమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.

పంచేంద్రియాల ద్వారా మనకు లభించే సమాచారం ఆధారంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని పర్సెప్షన్ అంటాం. అలాగే మనం ఏ స్థానంలో ఉండి అర్థం చెసుకుంటున్నాం అనేదాన్ని పర్సెప్చువల్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్స్ 5.

1వ పొజిషన్: ఒక అంశాన్ని పూర్తిగా మన కోణంలో చూడతం, అర్థంచేసుకోవడం. ఇందులో ఇతరుల మనోభావాలకు స్థానంలేదు.. నేను, నా సుఖం అనుకునే బాపతన్నమాట. ఈ స్థానాన్ని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి స్వార్థపరుడిగా కనిపిస్తాడు.

2వ పొజిషన్: ఒక అంశాన్ని ఎదుటివారి దృష్టిలో చూడటం. అంటే స్టెపింగ్   ఇన్ టూ అదర్స్ షూజ్ అన్నమాట. ఇందులో ఇతరుల మనోభావాలకే ప్రాథాన్యం. ఇందుకోసం కొంత సొంత లాభాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతాడు. అంటే  పరోపకారి పాపన్న టైప్ అన్నమాట.
 
3వ పొజిషన్: ఇది జడ్జ్ స్థానం. ఇరువర్గాల వాదనను తెలుసుకుని మాట్లాడే స్థానం. ఈ స్థానంలో ఉన్నవారికి భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి లేదా ఉన్నట్టుగా కనిపిస్తారు.

4వ పొజిషన్: మొదటి, రెండో స్థానాల్లో ఎవరి గోల వారిదే. మూడో స్థానంలోవారు భావోద్వేగాలు పట్టించుకోరు. మరి సమస్యకు పరిష్కారమెలా? ఆ మూడు పొజిషన్స్ లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆ మూడు పార్టీలను ఒక టీంలా కలుపుకుని సమస్యకు పరిష్కారం అన్వేషించే, చూపించే నాయకుడి స్థానమిది. ఈ స్థానంలోని వ్యక్తి ఉమ్మడి లక్ష్యాలకు ఎక్కువ విలువిస్తాడు. వ్యవస్థ డిస్ట్రబ్ కాకుండా చూసుకుంటాడు.

5వ పొజిషన్: ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్ కు వేగంగా మారుతూ అన్ని కోణాల్లో సమస్యను అర్థం చేసుకునే యూనివర్సల్ పొజిషన్ ఇది. అందరినీ సమ దృష్టితో చూసే సెయింట్ స్థానమిది.

ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన  పరిష్కారం కనుక్కోవాలంటే ఈ 5 పొజిషన్స్ ను  ఉపయోగించుకోవాలి. కానీ మన నాయకుల్లో ఒక్కరిలోనూ ఈ సమగ్ర దృష్టి కనిపించడంలేదు. అదే సమస్యను మరింత జటిలం చేస్తోంది.

తెలంగాణ సోదరులు 1వ పొజిషన్ లో ఉండి వారి వాదనకే పరిమితమవుతున్నారు. 2వ పొజిషన్ లోకి వెళ్ళి సీమాంధ్రుల మనోభావాలను అర్థంచేసుకునే ప్రయత్నమే చేయకపోగా తమ మాటలతో చర్యలతో మరింత భయపెడుతున్నారు. రాష్ట్రం విడిపొతే హైదరాబాద్ లో తమకు రక్షణ లేదనే  వారి భయాన్ని పెంచి పోషిస్తున్నారు.

సీమాంధ్ర సోదరులదీ ఇదే తీరు. తెలంగాణ సోదరుల పోరాటాన్ని, ఆరాటాన్ని  అర్థంచేసుకోకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్రులే  అడ్డుపడుతున్నారన్న భావన కలిగిస్తున్నారు.

ఈ రెండు వర్గాల, ప్రాంతాల వాదనలను విని తీర్పు చెప్పేందుకు శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అందులో ఎవరికి అనుకూలంగా ఉన్నది వారు కావాలంటున్నారు. అసలు శ్రీకృష్ణ కమిటీనే అమ్ముడుపోయిందంటున్నారు తెలంగాణ సోదరులు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.

4వ పొజిషన్ లో నిలిచి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమస్యను రాజకీయ దృష్టితోనే చూస్తోంది. తెలంగాణ ఇస్తే లాభమేంటి, ఇవ్వకపోతే నష్టమేంటి అనే కోణంలోనే అలోచిస్తోంది. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. వైషమ్యాలు, విద్వేషాలు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కావాల్సింది సమదృష్టి. ప్రాంతీయ దురభిమానాలకు దూరంగా, రాజకీయాలకు అతీతంగా, ఓట్లు పోతాయనే భయంలేకుండా, అందరిని కలుపుకుని సమస్యకు పరిష్కారం అన్వేషించే స్థితప్రజ్ఞత. మన మహానేతల్లో మచ్చుకు ఒక్కరిలోనైనా ఆ లక్షణం కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. మరి ఈ సమస్యకు పరిష్కారమేమిటంటారా... కాలం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. కాదంటారా?

Saturday, March 26, 2011

మనం చూసేది వాస్తవమేనా?

మనం జీవితంలో నిత్యం అనేక విషయాలను చూస్తుంటాం. మనం చూసిందే వాస్తవమని నమ్ముతుంటాం. నిజంగా మనం చూసేది వాస్తవమేనా అని ఏనాడూ ప్రశ్ర్నించుకోం. నిజానికి ఈ ప్రపంచంలో ఒక వస్తువును ఏ ఇద్దరూ ఒకేలా చూడలేరు,ఒక అంశాన్ని ఏ ఇద్దరూ ఒకేలా అర్థంచేసుకోలేరు. మనం పుట్టి పెరిగిన ప్రాంతం, పరిస్థితులు, చదువు, సంస్కౄతి, తదితరాలన్నీ మన మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తాయి. దాన్నిబట్టే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం, ప్రవర్తిస్తాం. అలాంటప్పుడు నేను నమ్మిందే రైట్, నేను నమ్మిన సిద్దంతమే కరెక్ట్ అనుకోవడంలో అర్థం ఏమైనా ఉందంటారా? నేనైతే ఖచ్చితంగా లేదనే అంటాను. ఏకం సత్యం, విప్రః బహుధా వదంతి అని భారతీయ తత్వం చెప్పినా, మ్యాప్ ఈజ్ నాట్ ది టెరిటరీ అని ఎన్ ఎల్ పి లో చెప్పినా అర్థమిదే. అందుకేనేమో శంకరాచార్యుడు ఈ ప్రపంచమంతా మాయ అన్నాడు. లోతుగా అలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. కానీ బ్రతికినంత కాలం ఆ మాయ నిజమేనని నమ్మాల్సి రావడమే జీవన వైచిత్రి. 

మీ విశేష్

ఇది నా కొత్త బ్లాగ్. రోజూ ఇక్కడ కలుసుకుని మాట్లాడుకుందాం