రాష్ట్రాన్ని కదిపి కుదిపేస్తున్న సమస్యేమిటో అందరికీ తెలుసు. దీని వెనకున్న రాజకీయాలు, భావోద్వేగాలు, సామాజికాంశాల గురించి ఇప్పటికే పత్రికల నిండా పేజీలకు పేజీలు రాసేశారు.. టీవీల్లో గంటల కొద్దీ మాట్లాడేశారు. వాటిలోనూ ఎవరి వాదన వారిదే. ఎందుకలా జరుగుతుందంటే ఎవరి దృష్టి వారిదే కనుక... అదేమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.
పంచేంద్రియాల ద్వారా మనకు లభించే సమాచారం ఆధారంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని పర్సెప్షన్ అంటాం. అలాగే మనం ఏ స్థానంలో ఉండి అర్థం చెసుకుంటున్నాం అనేదాన్ని పర్సెప్చువల్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్స్ 5.
1వ పొజిషన్: ఒక అంశాన్ని పూర్తిగా మన కోణంలో చూడతం, అర్థంచేసుకోవడం. ఇందులో ఇతరుల మనోభావాలకు స్థానంలేదు.. నేను, నా సుఖం అనుకునే బాపతన్నమాట. ఈ స్థానాన్ని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి స్వార్థపరుడిగా కనిపిస్తాడు.
2వ పొజిషన్: ఒక అంశాన్ని ఎదుటివారి దృష్టిలో చూడటం. అంటే స్టెపింగ్ ఇన్ టూ అదర్స్ షూజ్ అన్నమాట. ఇందులో ఇతరుల మనోభావాలకే ప్రాథాన్యం. ఇందుకోసం కొంత సొంత లాభాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతాడు. అంటే పరోపకారి పాపన్న టైప్ అన్నమాట.
3వ పొజిషన్: ఇది జడ్జ్ స్థానం. ఇరువర్గాల వాదనను తెలుసుకుని మాట్లాడే స్థానం. ఈ స్థానంలో ఉన్నవారికి భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి లేదా ఉన్నట్టుగా కనిపిస్తారు.
4వ పొజిషన్: మొదటి, రెండో స్థానాల్లో ఎవరి గోల వారిదే. మూడో స్థానంలోవారు భావోద్వేగాలు పట్టించుకోరు. మరి సమస్యకు పరిష్కారమెలా? ఆ మూడు పొజిషన్స్ లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆ మూడు పార్టీలను ఒక టీంలా కలుపుకుని సమస్యకు పరిష్కారం అన్వేషించే, చూపించే నాయకుడి స్థానమిది. ఈ స్థానంలోని వ్యక్తి ఉమ్మడి లక్ష్యాలకు ఎక్కువ విలువిస్తాడు. వ్యవస్థ డిస్ట్రబ్ కాకుండా చూసుకుంటాడు.
5వ పొజిషన్: ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్ కు వేగంగా మారుతూ అన్ని కోణాల్లో సమస్యను అర్థం చేసుకునే యూనివర్సల్ పొజిషన్ ఇది. అందరినీ సమ దృష్టితో చూసే సెయింట్ స్థానమిది.
ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవాలంటే ఈ 5 పొజిషన్స్ ను ఉపయోగించుకోవాలి. కానీ మన నాయకుల్లో ఒక్కరిలోనూ ఈ సమగ్ర దృష్టి కనిపించడంలేదు. అదే సమస్యను మరింత జటిలం చేస్తోంది.
తెలంగాణ సోదరులు 1వ పొజిషన్ లో ఉండి వారి వాదనకే పరిమితమవుతున్నారు. 2వ పొజిషన్ లోకి వెళ్ళి సీమాంధ్రుల మనోభావాలను అర్థంచేసుకునే ప్రయత్నమే చేయకపోగా తమ మాటలతో చర్యలతో మరింత భయపెడుతున్నారు. రాష్ట్రం విడిపొతే హైదరాబాద్ లో తమకు రక్షణ లేదనే వారి భయాన్ని పెంచి పోషిస్తున్నారు.
సీమాంధ్ర సోదరులదీ ఇదే తీరు. తెలంగాణ సోదరుల పోరాటాన్ని, ఆరాటాన్ని అర్థంచేసుకోకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్రులే అడ్డుపడుతున్నారన్న భావన కలిగిస్తున్నారు.
ఈ రెండు వర్గాల, ప్రాంతాల వాదనలను విని తీర్పు చెప్పేందుకు శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అందులో ఎవరికి అనుకూలంగా ఉన్నది వారు కావాలంటున్నారు. అసలు శ్రీకృష్ణ కమిటీనే అమ్ముడుపోయిందంటున్నారు తెలంగాణ సోదరులు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.
4వ పొజిషన్ లో నిలిచి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమస్యను రాజకీయ దృష్టితోనే చూస్తోంది. తెలంగాణ ఇస్తే లాభమేంటి, ఇవ్వకపోతే నష్టమేంటి అనే కోణంలోనే అలోచిస్తోంది. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. వైషమ్యాలు, విద్వేషాలు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కావాల్సింది సమదృష్టి. ప్రాంతీయ దురభిమానాలకు దూరంగా, రాజకీయాలకు అతీతంగా, ఓట్లు పోతాయనే భయంలేకుండా, అందరిని కలుపుకుని సమస్యకు పరిష్కారం అన్వేషించే స్థితప్రజ్ఞత. మన మహానేతల్లో మచ్చుకు ఒక్కరిలోనైనా ఆ లక్షణం కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. మరి ఈ సమస్యకు పరిష్కారమేమిటంటారా... కాలం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. కాదంటారా?
No comments:
Post a Comment