Thursday, April 28, 2011

మూడొంతుల జీవితం గడిచిపోయింది...


రాజా రవివర్మ, సద్దాం హుస్సేన్ లతో పాటు ఈ రోజు నేనూ పుట్టాను. ఇప్పటికి  మూడొంతుల జీవితం గడిచిపోయింది... ఎన్నో అనందాలతో, అనుభూతులతో. నేను కోరుకున్న సైకాలజీని చదవడం నా అదృష్టమైతే, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం అతిపెద్ద విజయంగా భావిస్తాను.

ఒక పల్లెటూరిలో పుట్టిన నేను సైకాలజీ చదువుతాననగానే ఒప్పుకోవడం మా నాన్న గొప్పతనం. ఎందుకంటే అప్పటికి మా ఊర్లో ఆ పేరు విన్నవాళ్ళే తక్కువ. అలాంటి సబ్జెక్ట్ చదువుతానంటే ఒప్పుకోవడమంటే గొప్పే కదా! అదే మా నాన్న గొప్పతనం... నేనేం చదవాలో అయన ఏనాడూ నిర్ణయించలేదు. ఎంతమంది తండ్రులుంటారలా? పెళ్ళి విషయంలో కూడా నా నిర్ణయాన్ని ఒక్క మాటా అనకుండా అంగీకరించిన గొప్ప మనసాయనది. అక్షరం రాకపోయినా కష్టాల్లో కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి అమ్మ. వాళ్ళు నాకు దూరమైనా వారి ప్రేమాభిమానాలు నాతోనే ఉన్నాయి, ఉంటాయి.

ఇక పెళ్ళి... మనం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎలా పుడతామో తెలియదు. అలాగే ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తామో తెలియదు. ఈ జనన మరణల మధ్య జరిగే అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళి. అది ప్రేమించిన వ్యక్తితో జరగడం ఆనందమే కదా? ఇరువైపుల పెద్దలను ఒప్పించి జరిపించుకోవడం విజయమే కదా? నా వరకు నాకు ఇప్పటికి అదే అతి పెద్ద విజయం.

ఇక విశ్వామిత్ర... ఇప్పుడు వాడే నా ఆనందం. పేరుకు తగ్గట్టుగా మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడని ఆశిస్తున్నాను. నోబెల్ ప్రైజ్ వాడి లక్ష్యమంటున్నాడు. బ్లెస్ హిం.

జీవితం... పదో తరగతి తప్పిన వాడిని దిగ్రీ, పీజీల్లో యూనివర్సిటీ ర్యాంకులు సాధించడం ఆనందాన్నిచ్చే విషయం. జర్నలిస్టుగా సక్సెస్ఫుల్ కెరీర్, సైకాలజిస్టుగా పేరు సంపాదించుకోగలిగాను. మనిషిగా కొన్ని తప్పులు చేసినా నో రిగ్రెట్స్. జీవితమంటే తప్పొప్పుల కలయికే కదా!

ఫ్రెండ్స్... జీవితంలో అనేక కష్టాల్లో అండగా నిలబడింది నా స్నేహితులే. అప్పట్లో మా ప్రసాద్ బాబాయ్ నుంచి ఇప్పుడు గోపి వరకు... అందరూ కొండంత అండ. ఇలాంటి మిత్రులు ఇంకా ఇంకా మరింతమంది దొరుకుతారనే ఆశ. అలాగే మా తాత, మా సాంబిరెడ్డి సర్, చలం... ఈ ముగ్గురే నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో ముఖ్యులు. ఇప్పుడు నేనిలా ఉండటానికి కారకులు.

ఇక మిగిలిన ఒక భాగం జీవితం... మరింత అర్థవంతంగా కొనసాగించాలి. ఈ సంవత్సరం 'జీనియస్ ' పైన బుక్ పబ్లిష్ చేస్తాను.  పదేళ్ళ కల అది. సాకారం చేసుకుంటాను. ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నాను. అది పూర్తయ్యాకే మరేదైనా.

2 comments: